అందుకే రాజకీయాల్లోకి వచ్చా
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయాల మార్పుపై దృష్టిపెట్టాలన్నారు. ఉడుకు నెత్తురుతో ఉన్న యువత తమతో కలిసి రావాలని కోరారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావడానికి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా ఓ కారణమని అన్నారు. బీఆర్ అంబేడ్కర్, ఫూలే విధానాలతో ముందుకెళ్తానన్నారు. దేశంలో కులాలు అంతం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి దాడులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. జనసేన ద్వారా ప్రజా సేవ చేసేందుకే ప్రజల్లోకి వచ్చానని పవన్ అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పర్యటనలో భాగంగా కొత్తగూడెం జిల్లా నుంచి రోడ్ షో ద్వారా పవన్ ఈ ఉదయం ఖమ్మంకు చేరుకున్నారు. అనంతరం ఎంబీ గార్డెన్స్‌లో కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘జై తెలంగాణ’ ‘జైహింద్’ అన్న నినాదాలు తనకెంతో ఇష్టమన్నారు.
తెలంగాణ జిల్లాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు పరిష్కారాలు చూపేందుకు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఏళ్లు గడిచినా నల్గొండ జిల్లావాసుల ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరకడంలేదన్నారు. ఫ్లోరైడ్ బాధితులను చూస్తే చెప్పలేనంత బాధ కల్గుతోందని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్లోరైడ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానన్నారు. ప్రజా సమస్యల కోసం వచ్చిన వ్యక్తిపై కొందరు దుందుడుకు స్వభావం ప్రదర్శిస్తున్నారని, అయితే తమకు పూర్తి సహనం ఉందన్నారు. మళ్లీ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వస్తానని పేర్కొన్నారు. తన ప్రసంగంతో అభిమానులు, కార్యకర్తల్లో పవన్ నూతన ఉత్సాహాన్ని నింపారు.
Comments
Post a Comment