సహజీవనానికి సై చెప్పి.. మాయమాటలు తో శిశువులను విక్రయించిన ఘనుడు

సహజీవనానికి సై చెప్పి.. మాయమాటలు తో శిశువులను విక్రయించిన ఘనుడు 

 పెళ్లయి ఇద్దరు పిల్లలున్న మహిళతో ఐదేళ్లు సహజీవనం చేశాడు. ఆ క్రమంలో వారికి పుట్టిన బిడ్డల్నీ విక్రయించాడు. పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ కోరడంతో ఆ వ్యక్తి ముఖం చాటేస్తున్నాడు. దీనిపై బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బి.తాడిపత్రి గ్రామానికి చెందిన పాపగారి సురేష్‌(27) రహ్మత్‌నగర్‌ ఉంటూ స్థిరాస్తి సంస్థలో పనిచేస్తున్నాడు. అప్పటికే పెళ్లయిన తనకంటే తొమ్మిదేళ్ల పెద్దైన సికింద్రాబాద్‌కు చెందిన స్వప్న(36) ఇతనికి పరిచయం అయింది. స్వప్నకు అప్పటికే 13 ఏళ్లు, 9 ఏళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలున్నాయి. భర్తతో విభేదించి అతనికి దూరంగా ఉంటూ పిల్లలను చెల్లెలు వద్ద ఉంచుతోంది. సురేష్‌ పరిచయంతో అతను పనిచేసే సంస్థలోనే ఉద్యోగంలో చేరింది. ఇద్దరూ రహ్మత్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉన్నారు. వీరికి 2014లో ఒక బాబు, 2015లో ఒక ఆడబిడ్డ పుట్టగా సురేష్‌ స్వప్నకు మాయమాటలు చెప్పి ఆ శిశువులను విక్రయించాడు. కొద్ది నెలలుగా అందరి ముందు పెళ్లి చేసుకోవాలని స్వప్న కోరుతోంది. నిందితుడు మాత్రం అప్పటి నుంచి తప్పించుకుంటున్నారు. ఒత్తిడి చేయడంతో రెండు నెలలుగా కనిపించడం లేదు. బాధితురాలు నవంబరు 24న పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని, పిల్లలనూ విక్రయించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సురేష్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్న నిందితున్ని శనివారం అరెస్టు చేసి, రిమాండ్‌ చేశారు. శిశువుల విక్రయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments