బాధ్యతాయుత రాజకీయాలు చేస్తా
ఉడుకుతున్న యువరక్తం కావాలి
పూర్వ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం ఖమ్మంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈనాడు, ఖమ్మం: అభిమానం ఉప్పొంగింది. రాజకీయ నాయకునిగా మారిన తమ ప్రియ కథానాయకుని చూసేందుకు యవకులు పోటీపడ్డారు. పెద్దలు రోడ్ షో వెంట నిరీక్షించారు. కరచాలనం కోసం పోటీపడ్డారు. పర్యటన ఆఖరి అంకంలో జనసేనాపతి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ సమావేశం నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.. వేదిక మీదకూ అభిమానులు తోసుకొనిరావడంతో గందరగోళం నెలకొంది.. ఓ పార్టీ అధినేత వస్తున్నపుడు చేయాల్సిన కనీస ఏర్పాట్లు కూడా స్థానిక నిర్వాహకులు చేయలేకపోయారు. మొత్తంగా కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఉభయ జిల్లాల్లో విజయవంతమైంది. పూర్వ ఖమ్మం జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రెండు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. మంగళవారం రాత్రి ఆయన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథి గృహానికి చేరుకొని అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం అక్కడ విలేకరులతో మాట్లాడారు. అనంతరం పవన్ ఖమ్మం వచ్చారు. స్థానిక ఎంబీ గార్డెన్‌లో పూర్వఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన కార్యకర్తలు, అభిమానుల సమావేశం నిర్వహించారు. ‘జై తెలంగాణ’ అంటూ పవన్ తన ప్రసంగం ప్రారంభించారు. ఉడుకుతున్న యువరక్తం తనకు కావాలని, బాధ్యతాయుత రాజకీయాలు చేస్తానంటూ పేర్కొన్నారు.
Comments
Post a Comment