వారి భాగస్వాములకూ వర్క్‌ పర్మిట్‌ ఇవ్వండి

వారి భాగస్వాములకూ వర్క్‌ పర్మిట్‌ ఇవ్వండి

హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములకు కూడా పని అనుమతి (వర్క్‌పర్మిట్‌) కల్పించాలని అమెరికాలోని పలు టెక్నాలజీ ట్రేడ్‌ గ్రూపులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఒబామా హయాంలోని హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములకు కూడా చట్టప్రకారం పని చేసుకోగలిగేలా ఉన్న నిబంధనను అలాగే కొనసాగించాలని ట్రేడ్‌ గ్రూపులు కోరుతున్నాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ తదితర ప్రముఖ కంపెనీలు ఈ గ్రూపుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్‌, యూఎస్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బీఎస్‌ఏ-ద సాఫ్ట్‌వేర్‌ అలయన్స్‌ సహా తదితర గ్రూపులు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగానికి ఈ మేరకు లేఖలు రాశాయి. హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతి కల్పించే హెచ్‌-4 ప్రోగ్రాంను అలాగే ఉంచాలని అభ్యర్థించాయి. ఈ హెచ్‌4 నిబంధనను ఎంతో మంది భారతీయులు ఉపయోగించుకుంటున్నారు.

అమెరికన్లకు ఉద్యోగాలను పెంచడం కోసం ట్రంప్‌ యంత్రాంగం హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతి తొలగించాలని భావిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ ట్రేడ్‌ గ్రూపులు ఈ అభ్యర్థన చేశాయి. హెచ్‌-4 నిబంధనను ఎక్కువగా మహిళలే ఉపయోగించుకుంటున్నారని, దీన్ని తీసేస్తే వారు అనిశ్చితిలో పడిపోతారని, వారిని పనిచేసుకోకుండా నియంత్రించినట్లవుతుందని లేఖలో పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగం చేయడానికి విదేశీయులు ఉపయోగించుకుంటున్న హెచ్1బీ వీసా విధానాల్లో మార్పులు చేయాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తున్న సంగతి తెలిసిందే.

Comments