ప్రేయసి కళ్లను టాటూ వేయించుకున్నాడు



ఇష్టమైన వారి కోసం కొందరు చేతులపై వారి పేర్లను టాటూలుగా వేయించుకుని తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కానీ ప్రముఖ అమెరికన్‌ గాయకుడు జెయిన్‌ మాలిక్‌ తన ప్రేయసి, సూపర్‌ మోడల్‌ గిగి హ్యాడిడ్‌ కళ్లను టాటూగా వేయించుకున్నాడు.

ఛాతీపై గిగి కళ్లను టాటూగా వేయించుకున్న ఫొటోను మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే లక్షల్లో లైక్‌లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తేనే మాలిక్‌ ఎంత గొప్ప ప్రేమికుడో అర్థమవుతోంది అంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మాలిక్‌ ప్రేయసి గిగి హ్యాడిడ్‌ అమెరికాలో బాగా పేరొందిన అంతర్జాతీయ సూపర్‌ మోడళ్లలో ఒకరు. ప్రముఖ న్యూయార్క్‌ కాస్మెటిక్‌ బ్రాండ్‌ మేబిలీన్‌కు అంతర్జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఆమె 2017లో భారత్‌కు రావాల్సి ఉంది. తన బ్రాండ్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమం నిమిత్తం గిగి భారత్‌ వస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆమెను బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ రిసీవ్‌ చేసుకోనున్నారని గిగి భారత్‌లో ఉన్నంత వరకు సోనమ్‌తోనే ఉంటారని మీడియా వర్గాలు ప్రకటించాయి. కానీ కొన్ని కారణాల వల్ల గిగి భారత్‌ పర్యటన వాయిదా పడింది.




Comments