ఘనంగా మండమెలిగే పండగ తరలివచ్చిన నాలుగూళ్ల పూజారులు
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సంబంధించి ముఖ్యఘట్టంగా పేర్కొనే మండమెలిగే పండగను బుధవారం పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్కదేవతకు, కన్నెపల్లిలో సారలమ్మదేవతకు ఈ పండగను ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క దేవత పూజారులు నిర్వహించిన పండగ తీరు మహాజాతర పూజలను తలపించింది. రోజంతా డోలు వాయిద్యాలతో ఊరంతా మారుమోగిపోయింది. పూజారులందరూ ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ గృహంనుంచి సమ్మక్క దేవత పూజామందిరానికి తరలివెళ్లారు. పూజామందిరంలో శుద్ధికార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పూజారుల ఆడపడుచులు వచ్చి అమ్మవారి పూజామందిరం, ఆరుబయట పుట్టమట్టితో అలంకరించి ప్రత్యేక ముగ్గులు వేశారు. అక్కడినుంచి వెళ్లి పోశమ్మ దేవత, బొడ్రాయి, పోతురాజుకు శాంతి పూజలు నిర్వహించారు. గ్రామానికి తూర్పు, పడమరకు బూరుగు వృక్షాలతో ధ్వజస్తంభాలు పాతారు. జీడిగింజలు, ఎండుమిరప, ఉల్లిగడ్డ, ఇప్పసార, కోడిపిల్లలతో దిష్టితోరణం కట్టి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా అష్టదిగ్బంధం చేశారు. రాత్రి అమ్మవారి పూజాసామగ్రి, అడేరాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారికి ఇష్టనైవేద్యాలు సమర్పించారు. డోలి వాయిద్యాలతో అమ్మవారిని తలుస్తూ రాత్రంతా జాగారం నిర్వహించారు. తెల్లవారుజామున పూజలు ముగించి ఇళ్లకు తిరుగు పయనమయ్యారు.
Comments
Post a Comment