కిమ్‌ ప్రేయసి రాకతో ద.కొరియాలో ఆందోళనలు

కిమ్‌ ప్రేయసి రాకతో ద.కొరియాలో ఆందోళనలు


దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా ఒలింపియన్లు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రేయసి హ్యోన్‌ సాంగ్‌వోల్‌ ద.కొరియాకు వెళ్లారు.
ఒలింపిక్స్‌లో భాగంగా ఉ.కొరియా ఆర్ట్‌ ట్రూప్‌కు హ్యోన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించేందుకు హ్యోన్‌ ద.కొరియా వెళ్లారు. హ్యోన్‌ ద.కొరియా చేరుకోగానే మీడియా ఆమె ఫొటోలు తీసేందుకు ఎగబడింది. ఎక్కడికి వెళ్లినా ఆమెనే ఫాలో అయ్యారు.  కానీ ఆమె విలేకర్లతో మాట్లాడకుండా వెళ్లిపోయింది.
మరోవైపు హ్యోన్‌ రాకతో దక్షిణ కొరియాలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ద.కొరియా కార్యకర్తలు కిమ్‌ ఫొటోలను దహనం చేశారు. దాదాపు 200 మంది కార్యకర్తలు హ్యోన్‌ వెళ్లిపోవాలంటూ ఆందోళన చేశారు. కానీ హ్యోన్‌ వారిని పట్టించుకోలేదు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హ్యోన్‌ ఆర్మీలో  పనిచేసేవారని కిమ్‌తో సన్నిహితంగా ఉండేవారని ద.కొరియా మీడియా వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియాకి చెందిన 22 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈ ఒలింపిక్స్‌ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తరువాత ద.కొరియా, ఉ.కొరియా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు కిమ్‌ ప్రేయసి రాకతో ఆందోళనలు మొదలయ్యాయి.



Comments