ఇరవై నాలుగేళ్ల చిరంజీవి... సాయిధరమ్‌

ఇరవై నాలుగేళ్ల చిరంజీవి... సాయిధరమ్‌ 

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథా  నాయిక. సి.కల్యాణ్‌ నిర్మాత. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ  సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరులతో మాట్లాడింది. ‘‘సినిమా  నిన్నే చూశాం. చాలా సంతృప్తినీ, ఆనందాన్నీ ఇచ్చింది. మంచి కథ ఇచ్చారు ఆకుల శివ. పాటల్లో సాయిధరమ్‌ని చూస్తే చిరంజీవి గుర్తొచ్చారు. ఇరవైనాలుగేళ్ల చిరంజీవిలా ఉన్నాడ’’న్నారు వినాయక్‌. ‘‘ఖైదీ నెం.150 తరవాత వినాయక్‌తో పనిచేయడానికి పెద్ద పెద్ద హీరోలు వస్తారు. కానీ... ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 9నే వరుణ్‌తేజ్‌ సినిమా విడుదల అవుతోంది. మా రెండు చిత్రాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’నని సాయిధరమ్‌ తెలిపారు. ‘‘లక్ష్మి, కృష్ణ, నాయక్‌ ఈ మూడు చిత్రాలకూ నేనే కథ అందించా. అవన్నీ మంచి విజయం సాధించాయి. ‘ఇంటిలిజెంట్‌’ కూడా ఆ జాబితాలో చేరుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు రచయిత ఆకుల శివ. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘సాయిధరమ్‌ ఇంత వరకూ ఇలాంటి స్టెప్పులు వేయలేదు’’ అన్నారు. కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి,  సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.





Comments