కారు అనుకొని వెళ్లారు.. తీరాచూస్తే..

కారు అనుకొని వెళ్లారు.. తీరాచూస్తే..

పార్కింగ్‌ నిషేధం ఉన్న స్థలంలో ఓ కారు పార్క్‌ చేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే జరిమానా విధించారు. ఆ చలానా స్లిప్‌ను ఇవ్వడానికి కారు దగ్గరకు వెళ్లిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా..? అది నిజమైన కారు కాదు కాబట్టి. ఓ కళాకారుడు మంచుతో నిర్మించిన కారు ప్రతిమ. కెనడాలోని మాంట్రియల్‌లో ఇది జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మాంట్రియల్‌కు చెందిన సిమన్‌ లాప్రైజ్‌ అనే వ్యక్తి మంచుతో రకరకాల ఆకృతులను చేయడంలో నేర్పరి. అలా రోడ్డుపై కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన మంచుతో కారు ప్రతిమను తయారు చేశాడు. నిషేధిత పార్కింగ్‌ ప్రదేశంలో రోడ్డు మీద దాన్ని చేశాడు. రాత్రివేళ అటువైపుగా వచ్చిన పోలీసులు దూరం నుంచి చూసి కారును నిషేధిత పార్కింగ్‌ ప్రదేశంలో పెట్టినట్లు గమనించారు. వెంటనే చలానా రాసి దాన్ని ఇచ్చేందుకు పోలీసులు కారు దగ్గరకు వెళ్లారు. తీరా దగ్గరకెళ్లి చూస్తే.. అది కారు కాదని.. మంచుతో తయారు చేసిన కారు ప్రతిమ అని గుర్తించారు. వెంటనే దాన్ని చూసి నవ్వుకున్నారు. ఇదంతా అక్కడే ఉండి గమనించిన సిమన్‌ ఆ ఫొటోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇంకేముంది అవి కాస్తా వైరల్‌గా మారాయి. కారు ప్రతిమను చూసి గందరగోళానికి గురైన పోలీసుల బిక్కమొహం చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. అవి ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి మరి..!

Comments