‘పద్మావత్‌’కు సుప్రీంలో మళ్లీ ఊరట

‘పద్మావత్‌’కు సుప్రీంలో మళ్లీ ఊరట


పద్మావత్‌’ సినిమాకు సుప్రీం కోర్టు తీర్పు మరోసారి ఊరటనిచ్చింది. ఈ చిత్రం విడుదల గురించి మరోసారి ఆలోచించాలని కోరుతూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను ఆపాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత  న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ‘పద్మావత్‌’ సినిమాపై ఎలాంటి నిషేధం విధించలేమని తీర్పునిచ్చింది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో అనేక వివాదాలు ఎదుర్కొంటున్న ‘పద్మావత్‌’ విడుదలను నిషేధిస్తున్నట్లు మొదట వెల్లడించాయి. దీంతో చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన న్యాయస్థానం సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అన్ని రాష్ట్రాల్లో విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. ఆందోళనలు జరుగుతాయని చిత్రాన్ని ఆపకూడదని, ప్రజల్ని రక్షించి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని పేర్కొంది. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించమని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సోమవారం పిటిషన్‌ దాఖలు చేశాయి.

రాజ్‌పుత్‌ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్‌’ సినిమాను తెరకెక్కించారు. దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఇందులో తమ దేవతలాంటి పద్మిని గురించి తప్పుగా చూపిస్తున్నారని, చరిత్రను వక్రీకరించారని రాజ్‌పుత్‌ కర్ణిసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే సినిమాను చూడకుండా, భన్సాలీ మహారాణి పద్మిని గురించి ఏం చూపించారో తెలియకుండా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు.




Comments