నకిలీ బాబా అరెస్టు

నకిలీ బాబా అరెస్టు


భీమారం, న్యూస్‌టుడే: హోమాలు, యజ్ఞాలు, పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన ఘటనలో నకిలీ బాబాను బుధవారం అరెస్టు చేసినట్లు కేయూసీ సీఐ సతీశ్‌బాబు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన చారుగుండ్ల లక్ష్మినారాయణ అనే వ్యక్తి గతంలో అక్కడ వస్త్ర వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయారు. అనంతరం పూజలు, యజ్ఞాలు చేయించటం ద్వారా బాబా అవతారమెత్తారు. ఇందులో భాగంగానే గోదావరిఖని నుంచి వరంగల్‌ నగరంలోని గోపాలపూర్‌కు మకాం మార్చారు. అనంతరం నగరంలోని రెడ్డి కాలనీలో తన కార్యాలయాన్ని  ఏర్పాటు చేశారు. అన్ని రకాల సమస్యలను పరిష్కారమని ప్రకటన బోర్డు ఏర్పాటు చేయడంతో పలువురు వచ్చి సంప్రదించేవారు. వారి నుంచి రూ.వేలల్లో నగదు తీసుకుని తన అనుచరుల చేత పూజా కార్యక్రమాలు చేయించేవారు. అయితే గోపాలపూర్‌కు చెందిన కె.అనిత అనే మహిళ సమస్య పరిష్కారం కోసం బాబాను ఆశ్రయించింది. ఆమె ఇంట్లో పూజలు చేస్తానని రూ.50 వేలు తీసుకున్నాడు. పూజలు చేసిన ఫలితం లేకపోవడంతో ఆమె అతడిని గట్టిగా నిలదీసింది. ఆగ్రహంతో బాబా ఆమెను కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు బుధవారం కేయూసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారించిన పోలీసులు అతనిపై 406, 420 సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేసి, అరెస్టు చేశారు.


Comments