కుమార్తెకు సైనెడ్ ఇచ్చి హతమార్చాడు..ఉరిగా చిత్రీకరించబోయి దొరికేసిన తండ్రి!
తన కుమార్తెకు సైనెడ్ ఇచ్చి హతమార్చాడో తండ్రి. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించబోయి అడ్డంగా దొరికేశాడు. దీనికి కారణం-డబ్బు. సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో కుమార్తెకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో తండ్రే ఆమెను హతమార్చాడు.ఈ ఘటన కర్ణాటకలోని రామనగరలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు వీణా. 24 సంవత్సరాల వీణా వివాహిత. బెంగళూరు దక్షిణా తాలూకా పరిధిలోని కగ్గలిపురలో నివాసం ఉంటున్నారు. విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నారు.బెంగళూరు దక్షిణ తాలూకాలో ఆమె తండ్రికి రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఉంది. దాన్ని అమ్మితే.. వీణకు కోటి రూపాయలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తండ్రికి ఇష్టం లేదు. భర్తకు దూరంగా ఉంటోన్న వీణకు స్థానికంగా చిక్కబ్యాటప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయం ఆమె తండ్రికి తెలుసు. దీనితో చిక్కబ్యాటప్పతో కలిసి వీణ హత్యకు కుట్ర పన్నాడు. అతనితో పాటు లక్ష్మి, ఇస్మాయిల్ ఖాన్, మునిరాజులతో కలిసి వీణను హతమార్చడానికి పథకం పన్నాడు. సైనెడ్ ఇచ్చి హతమార్చాడు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడు.ఈ విషయం వీణ భర్తకు తెలిసింది. దీనితో అతను కగ్గలిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టమ్ నిర్వహించగా..శరీరంలో సైనెడ్ ఆనవాళ్లు దొరికాయి.దీనితో పోలీసులు తండ్రిని, చిక్కబ్యాటప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. దీనితో వారు తమ నేరాన్ని అంగీకరించారు. ఇంజెక్షన్ రూపంలో సైనెడ్ ఇచ్చి హతమార్చినట్లు చెప్పారు.
Comments
Post a Comment