95% నాయకులు రాస్కెల్స్: మోహన్‌బాబు
95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని ప్రముఖ నటుడు మోహన్‌బాబు అభిప్రాయపడ్డారు. ఇండియాటుడే నిర్వహించిన కాన్‌క్లేవ్ రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సెషన్‌లో మోహన్‌బాబు, ఆయన కుమార్తె మంచులక్ష్మి మాట్లాడారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు సినిమాలు, రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. నా స్నేహితుడు, అన్నయ్య తారక రామారావు నిజాయతీ పరుడు. అతడికి లంచం అంటే ఏంటో కూడా తెలియదు. 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్. ఎన్టీఆర్ నన్ను రాజ్యసభకు పంపించారు, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా తిరిగి వచ్చా.’
‘ప్రజలకు నాయకులు అనేక వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని నిలబెట్టుకున్న వారు ఎవరు?నిజంగా వాళ్లు తమ ప్రమాణాలను నిలుపుకుని ఉంటే భారతదేశం ఇంకా బాగుండేది.’ అని డైలాగ్ కింగ్ అన్నారు.
అనంతరం ఆయన తన సినీ కెరీర్ ఆరంభం, కమల్-రజనీలతో బంధం గురించి పంచుకున్నారు. ‘మా నాన్న టీచర్. నేనూ టీచర్ అవ్వాలని..నన్ను పదో తరగతి వరకు చదివించారు. ఇదే సమయంలో నన్ను పొలానికి కూడా పంపారు. ఆ తర్వాత నేను పై చదువుల కోసం చెన్నైకి వెళ్లా. చదువుకుంటూనే సినిమాల్లో నటించడానికి ప్రయత్నించా. రోజూ పని మీద సినిమా సెట్స్‌లో దర్శకులను కలవడానికి వెళ్లేవాడ్ని. కానీ నన్ను చాలా సార్లు బయటికి పంపించేశారు. 1975లో నా జీవితం మారిపోయింది. నాకు పెళ్లైన తర్వాత తొలి సినిమాలో నటించా. అది సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా నటించా. అప్పట్లో సినీ పరిశ్రమలో ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు కాబట్టి రోజులో మూడు షిఫ్టులు పనిచేసేవాడ్ని.’
‘రజనీకాంత్, కమల్‌హాసన్ నాతో కలిసి పనిచేశారు. గత 40 ఏళ్లుగా నాకు రజనీ తెలుసు. ఆయన నాకు మంచి మిత్రుడు. కమల్‌తోనూ నాకు మంచి అనుబంధం ఉంది.’ అని ఆయన చెప్పారు.
తన తండ్రి గురించి మంచులక్ష్మి మాట్లాడుతూ.. ‘ఆయన కింగ్‌మేకర్. రాజకీయాల్లోకి వెళ్లే నటుల తరఫున ప్రచారం చేస్తారు, వారిని గెలిపించేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడున్న వారు ఎవరూ ఆయనకు తెలియదు. అయినా ఆయన తన అభిప్రాయాల్ని పంచుకోవడానికి భయపడరు.’ అని పేర్కొన్నారు.


Comments
Post a Comment