ఆ కిరాతక తల్లిదండ్రులకు
94ఏళ్ల జైలు?
13 మంది కన్నబిడ్డలను అత్యంత
దారుణంగా హింసించిన అమెరికా దంపతులకు 94 ఏళ్లపై పైగా జైలు శిక్ష పడే అవకాశం
ఉన్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. ఆహారం సరిగా పెట్టకుండా 13 మంది సొంత
పిల్లల్ని చిత్రవధ చేసిన డేవిడ్ ఎలెన్ టూర్పిన్, లూయిస్
అన్నాను అక్కడి పోలీసులు గురువారం న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. సొంత
పిల్లల్ని అత్యంత దారుణంగా గొలుసులతో బంధించి, చిత్రహింసలకు
గురి చేయడానికి గల కారణాలను మాత్రం వాళ్లు చెప్పడం లేదు. పైగా తమకేమీ తెలియదనీ, అమాయకులమనీ అంటున్నారు. వారిపై పోలీసులు హింస, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి అభియోగాలను నమోదు
చేశారు. ఈ కేసుల్లో ఆ దంపతులు దోషులుగా తేలితే.. ఒక్కొక్కరికి 94 ఏళ్ల జైలు శిక్ష
పడే అవకాశం ఉంది.
కనీసం చిన్నారులను బాత్‌రూంకి
కూడా వెళ్లనీయకుండా ఆ తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. ‘స్నానం చేయనీయకుండా ఏడాది పాటు అలాగే ఉంచారని, వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది’ అని చిన్నారులను పరీక్షించిన వైద్యులు తెలిపారు. 13 మంది
చిన్నారులు ఎక్కడికీ కదలకుండా ఉండేలా గొలుసులతో బంధించి ఉంచారు. ఇటీవల వెలుగులోకి
వచ్చిన ఈ విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 13 మంది పిల్లలో ఒకరైన ఓ 17 ఏళ్ల
బాలిక తప్పించుకొని క్యాలిఫోర్నియా పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో అసలు విషయం
బయటకు వచ్చింది. అక్కడకు వచ్చిన పోలీసులకు చీకట్లో గొలుసులతో కట్టేసిన పిల్లలు
కనిపించారు. బాధిత పిల్లల్లో రెండేళ్ల పాప నుంచి 29ఏళ్ల యువతి వరకూ ఉన్నారు.
వారంతా బాగా బక్కచిక్కిపోయి ఉన్నారు. పోషకాహార లోపం కారణంగా చిన్నారులంతా అలా
ఉన్నారని పోలీసులు తెలిపారు.
Comments
Post a Comment