ఆస్ట్రేలియాలో హిట్టింగ్‌.. నగరంలో బెట్టింగ్‌ రూ.44 లక్షల సొత్తు, ఇతర సామగ్రి స్వాధీనం

ఆస్ట్రేలియాలో హిట్టింగ్‌.. నగరంలో బెట్టింగ్‌ రూ.44 లక్షల సొత్తు, ఇతర సామగ్రి స్వాధీనం 


ఆస్ట్రేలియా (సిడ్నీ)లో జరుగుతున్న బిగ్‌ బాస్‌ లీగ్‌-టి20పై పెద్దఎత్తున బెట్టింగ్‌ కాస్తున్న మూడు ముఠాల స్థావరాలపై హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. పదకొండు మంది క్రికెట్‌ బుకీలను అరెస్టు చేశారు. భారీఎత్తున నగదు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకృషన్‌రావు, నార్త్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావుతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. సిడ్నీ క్రీడా మైదానంలో జరుగుతున్న బిగ్‌ బాస్‌ లీగ్‌, టీ-20 మ్యాచ్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌, నారాయణగూడ, బంజారాహిల్స్‌ కేంద్రాలుగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. డీసీపీ రాధాకృష్ణన్‌రావు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు సారథ్యంలో బృందాలుగా ఏర్పడి దాడులను నిర్వహించారు. ఆబిడ్స్‌ పోలీసు ఠాణా పరిధిలోని కింగ్‌కోఠిలోని పరల్‌ ప్యాలెస్‌లోని ఫ్లాట్‌ నంబరు 401లో నిజామాబాద్‌ జిల్లా గోషాలకు చెందిన క్రికెట్‌ బుకీ మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ (31), అతని అనుచరులు రాజస్థాన్‌కు చెందిన మహేందర్‌కుమార్‌ కర్వా (51), మెహిదీపట్నం దిల్‌షాద్‌నగర్‌ కాలనీ నివాసి మహ్మద్‌ రియాజుద్దీన్‌ (35), సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన యెల్లా సురేశ్‌ (37)ను అదుపులోకి తీసుకొన్నారు. బంజారాహిల్స్‌ రోడ్డు నం: 7లోని శర్మ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో దాడులు చేయగా.. నిజామాబాద్‌లో చీరల వ్యాపారం చేసే చిన్ని రాజేందర్‌ (24), నిజామాబాద్‌లోని పోచమ్మగల్లీకి చెందిన కట్ల రాహుల్‌ (21)ను అదుపులోకి తీసుకొన్నారు. నారాయణగూడ పోలీసు ఠాణా పరిధిలో విఠల్‌వాడి చౌరస్తాలో ఉన్న మెట్రో టవర్స్‌ అపార్ట్‌మెంట్స్‌ ఫ్లాట్‌ నం: 302లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న బుకీ ముఖేశ్‌ కుమార్‌, అతని సబ్‌ బుకీలు రాంకోఠిలో ఆటో మొబైల్‌ వ్యాపారి గురువిందర్‌సింగ్‌ అలియాస్‌ గౌరవ్‌ (34), గౌలీగూడ సిక్‌లేన్‌లోని ఫైనాన్స్‌ వ్యాపారి భుపేందర్‌సింగ్‌, సికింద్రాబాద్‌ కార్ఖానాకు చెందిన ఆనంద్‌కుమార్‌ (38), మలక్‌పేట్‌ దయానంద్‌నగర్‌కు చెందిన దాగా అభిషేక్‌ (33)లను అరెస్టు చేశారు. వీరందరికీ రింగ్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రధాన బుకీ బేగంబజార్‌కు చెందిన విశాల్‌ లోథియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వివరించారు.
పెద్దఎత్తున డబ్బు వసూళ్లు: గతంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.44.30 లక్షల నగదు, ఒకేసారి 36 మంది సబ్‌ బుకీలతో కార్యాకలాపాలు నిర్వహించడానికి అవసరమైన యంత్రం, మూడు టీవీలు, మూడు సెట్‌ టాప్‌ బాక్స్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు, 62 సెల్‌ఫోన్‌లు, నగదు లెక్కించే యంత్రం, గగణ యంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్ల ద్వారా ఫంటర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బును వసూళ్లు చేశారని కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.




Comments