సినిమాల్లోనే హ్యాపీ, మా జీవితాల్లో ఉండదు: అల్లరి నరేష్ భావోద్వేగం


సినిమాల్లోనే హ్యాపీ, మా జీవితాల్లో ఉండదు: అల్లరి నరేష్ భావోద్వేగం



సినిమా ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామని, డైరెక్టర్ అవుదామని ఎన్నో కలలతో వచ్చిన వారిలో 90 శాతం మంది పెయిల్యూర్ అవుతుంటారు. వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని లైట్ బాయ్ గానో, డ్రైవర్లుగానో, జూనియర్ ఆర్టిస్టుగానో కాలం వెళ్లదీసే వారు ఎందరో. అనారోగ్యం కారణంగానో, సరైన ఉపాధి లేక పోవడం వల్లనో కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం 'మనం సైతం' అనే సంస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 'మనం సైతం' సంస్థ కష్టాల్లో ఉన్న పది మంది ఇండస్ట్రీకి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

నేను యాక్టింగ్ క్లాసులకు వెళ్లినపుడు ఒకటి నేర్పించారు. ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరే- నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే... ఇది శ్రీ శ్రీ గారి కవిత. మా సినిమా ఇండస్ట్రీకి ఇది సరిగ్గా సరిపోతుంది.

కేవలం సినిమాల్లోనే మేము హ్యాపీగా ఉన్నట్లు కనపిస్తాం. కానీ ఇండస్ట్రీలో చాలా మంది జీవితాల్లో హ్యాపీ ఉండదు. ఉదాహరణకు ఓ విషయం చెబుతాను. నేను యాక్టింగ్ నేర్చుకునేపుడు 106 మంది ఉండేవారం. దాంట్లో ఆరుగురు మాత్రమే ఆర్టిస్టులు అయ్యారు. మిగతావారు ఎక్కడ ఉన్నారో తెలియదు.మొన్న ఎక్కడో యాక్టింగ్ క్లాస్ ఫ్రెండు కనిపించాడు. ఏం చేస్తున్నావంటే జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్నానని చెప్పాడు.‘చాలా సంవత్సరాల ట్రై చేశాను.... ఇంటికెళ్లే పరిస్థితి లేక పోవడంతో సినిమానే నమ్ముకుని ఇక్కడే ఉండిపోయాను. కృష్ణా నగర్లో తిరుగుతుంటే జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం వస్తే చేసుకుంటూ జీవిస్తున్నాను' అని చెప్పాడు. అతడు ఆ విషయం తెలిసిన వెంటనే చాలా బాధేసింది.ఎంతో మంది ఎన్నో కలలతో సినిమా ఇండస్ట్రీకి వస్తారు. అందులో కొందరి కలలు మాత్రమే నెరవేరుతారు. 90 శాతం మంది కల నెరవేరడం లేదు. ఆ విషయాన్ని వెళ్లి ఎవరికీ చెప్పుకోలేరు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కష్టపడుతూ జీవిస్తున్న వారికి సహాయం అందించేందుకు ‘మనం సైతం' సంస్థ ఏర్పడటం ఆనందంగా ఉంది అని అల్లని నరేష్ తెలిపారు.






Comments