తత్కాల్ టికెట్లు మాయమవడానికి కారణం ఏంటో తెలుసా ?

 తత్కాల్ టికెట్లు మాయమవడానికి కారణం ఏంటో తెలుసా ?

రైల్వే తత్కాల్ టికెట్ బుక్ చేయడం అన్నది ఎంత కష్టంగా తయారయిందో..! ఇంటర్నెట్ ద్వారా కూడా దొరకడం చాలా కష్టం అయిపొయింది. ఇన్ని రోజులు మనల్ని మోసం చేసి.. రైల్వే టికెట్లు దక్కకుండా చేసింది ఓ వ్యక్తి.. అతడితో పనిచేస్తున్న దళారులు. ఆ వ్యక్తి కూడా సామాన్యుడు కాదు.. ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆఫీసులో అసిస్టెంట్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు. అజయ్ గార్గ్ అనే వ్యక్తి తన మేధస్సును అంతా వాడి.. మన ఐ.ఆర్.సి.టి.సి. లో ఉన్న లోపాల కారణంగా ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ డిజైన్ చేసి తనకు తెలిసిన దళారులకు ఇచ్చాడు. 2007 నుంచి 2011 వరకూ ఐఆర్సీటీసీలో పని చేసిన అనుభవం, సాఫ్ట్ వేర్ నిపుణుడు కావడంతో, వ్యవస్థా లోపాలపై అవగాహన పెంచుకుని, ఒక్క క్లిక్కుతో వందల టికెట్లు సంపాదించేలా సాఫ్ట్ వేర్ సృష్టించాడు. ఇంకేముంది అలా తత్కాల్ సమయం ఓపెన్ అవగానే ఇక్కడ దళారులు ఆ బెర్త్ లను రిజర్వ్ చేస్తారన్నమాట..! ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఒక టికెట్ పీఎన్ఆర్ పొందాలంటే, కనీసం రెండు నిమిషాలు సమయం తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సాఫ్ట్ వేర్ సాయంతో తత్కాల్ టికెట్ల జారీ మొదలు కాగానే, సెకన్లలో భారీగా టికెట్లను పొందవచ్చు. అతనికి అనిల్ గుప్తా అనే మరో యువకుడు సహకరించాడని సీబీఐ అధికారులు తెలిపారు. వీరు తమ సాఫ్ట్ వేర్ ను దళారులకు విక్రయించి కోట్ల ఆస్తులు కూడగట్టడం గమనార్హం. ఢిల్లీ, ముంబైసహా 14 ప్రాంతాల్లో ఆస్తులను సంపాదించారు. ఈ సాఫ్ట్ వేర్ ను వాడుకోవాలంటే లాగిన్, ఐడీ, పాస్ వర్డ్ అవసరం. దళారుల నుంచి మళ్లీ మళ్లీ డబ్బులు దండుకోవడం కోసం పాస్ వర్డ్ ను గార్గ్ తరచూ మార్చేవాడు. దీంతో దళారులు కూడా అతనికి భారీగానే డబ్బు ముట్టజెప్పేవారు. ప్రస్తుతం ఈ కేసును రైల్వే అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అలాగే అరెస్టుల పర్వం కూడా మొదలైంది.





Comments