ప్రజలు నచ్చేలా.. మెచ్చేలా జిల్లా పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు


ప్రజలు నచ్చేలా.. మెచ్చేలా జిల్లా పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు


ప్రజలు చెల్లించే పన్నులతో మనం జీతాలు పొందుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హోంగార్డు నుంచి పోలీస్‌ అధికారి వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏదైనా సమస్యతో పోలీస్‌స్టేషన్‌కు వస్తే వారి గౌరవ, మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ప్రజలతో మమేకమయ్యే అదృష్టం దక్కిందని భావించాలి. ప్రజలు నచ్చేలా, వారు మెచ్చేలా పోలీసు విధులు కొనసాగాలి’ అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లా యంత్రాంగానికి సూచించారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా అన్ని జిల్లాల్లోని యంత్రాంగంతో మమేకమవుతున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ ఆయా జిల్లాల్లోని స్థితిగతులపై పట్టుబిగిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం జిల్లాలో ఆయన పర్యటించారు. మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా కొత్తగూడెం ప్రకాశం మైదానం చేరుకున్నారు. స్టేడియం నుంచి నేరుగా త్రీఇంక్లైన్‌, గరీబుపేట సమీపంలోని జిల్లా పోలీసు కార్యాలయాలకు కేటాయించిన స్థలాన్ని, పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ స్థలాన్ని సందర్శించారు. అక్కడ నిర్మాణాలకు సంబంధించి ముందస్తుగానే సిద్ధం చేసిన ప్రణాళిక పత్రాలను, సర్వే నివేదికలను, ప్లాన్‌లను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని విభాగాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డీఎస్పీ నుంచి పై స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబర్‌ కిశోర్‌ ఝా జిల్లాలోని ప్రధాన సమస్యలు, వాటిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో పోలీస్‌ల ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు, నేరాలను అదుపు చేయడానికి కొనసాగిస్తున్న చర్యలను వివరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌ స్టేషన్లలో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మావోల సంచారం, వారి ప్రభావం అధికంగా ఉండే సరిహద్దుల్లోని ఠాణాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర ప్రక్రియగా కార్యాచరణ కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సింగరేణి అతిథి గృహంలో జిల్లాలోని అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అసాంఘీక శక్తులను అరికట్టి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని తెలిపారు. జిల్లాలో పోలీసుల పనితీరు గురించి ఎప్పటికప్పుడు మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుందని ఇదే విధంగా పని చేస్తూ పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసింగ్‌ను రాష్ట్రానికి మోడల్‌గా మారాలన్నారు. ఆ మేరకు అధికారులు సమష్టిగా కృషి చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొట్టమొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించడానికి వచ్చిన డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నార్త్‌జోన్‌ ఐజీపీ నాగిరెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సజ్జనార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీపీ నవీన్‌చంద్ర, ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ ఎస్‌ఐబీ నర్సింగరావు, భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్‌, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


Comments