సునీల్.. లైఫ్ అండ్ డెత్!

సునీల్.. లైఫ్ అండ్ డెత్!


కమెడియన్‌గా తిరుగులేని స్థితిలో ఉండగా.. హీరోగా మారి వరుస విజయాలందుకున్నాడు సునీల్. కానీ ఆ విజయాల్ని తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. తన ఇమేజ్‌కు సూటవ్వని సినిమాలు చేసి ట్రాక్ తప్పాడు. వరుసగా అరడజనుకు పైగా ఫ్లాపులు తిన్నాడు.

చివరగా వచ్చిన ‘ఉంగరాల రాంబాబు’ ఈ ఏడాదిలో వచ్చిన చెత్త చిత్రాల్లో ఒకటనిపించుకుంది. దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ఈరోజు విడుదలవుతున్న ‘2 కంట్రీస్’ మీదే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హీరోగా సునీల్ కెరీర్‌కు ఇది లైఫ్ అండ్ డెత్ అనదగ్గ సినిమానే. ఈ సినిమా తేడా కొడితే ఇక సునీల్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం.

‘ఉంగరాల రాంబాబు’ దెబ్బకే సునీల్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన సినిమా ఒకటి ఆగిపోయింది. సునీల్‌తో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్న మిగతా వాళ్లు కూడా వెనక్కి తగ్గారు. ఇక ‘2 కంట్రీస్’ కూడా తేడా కొడితే.. ఇక సునీల్‌‌ను మళ్లీ హీరోగా చూడలేకపోవచ్చు. తాను హీరోగా మూడు కమిట్మెంట్లు ఇచ్చినట్లు.. ఆ మూడు సినిమాలూ వచ్చే ఏడాదే మొదలవుతాయన్నట్లుగా మాట్లాడాడు సునీల్. కానీ ‘2 కంట్రీస్’ ఆడితేనే వాటిపై ఆశలుంటాయి. లేదంటే వాటిలో ఒక్కటి కూడా ముందుకు కదలకపోవచ్చు.

అసలు సునీల్‌ అటు కమెడియన్‌ వేషాలకు దూరమై.. ఇటు హీరోగా ఫెయిలై ఎటూ కాని పరిస్థితుల్లో ఉన్నాడిప్పుడు. మళ్లీ కామెడీ వేషాలేస్తే జనాలు చూస్తారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘2 కంట్రీస్’ అతడికి ఎలాంటి ఫలితాన్నిచ్చి.. కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.



Comments