నేతాజీ చితాభస్మానికి పరీక్షలు జరుపడం ఒక్కటే మార్గం – బోస్ కుమార్తె అనిత !

నేతాజీ చితాభస్మానికి పరీక్షలు జరుపడం ఒక్కటే మార్గం బోస్ కుమార్తె అనిత !

జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భౌతిక అవశేషాలపై డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ఆయన కుమార్తె అనితాబోస్ పాఫ్ డిమాండ్ చేశారు. టోక్యో నుంచి బోస్ చితాభస్మాన్ని భారత్‌కు రప్పించి పరీక్షలు జరిపే విషయమై ప్రధాని నరేంద్రమోదీని వచ్చే ఏడాది కలిసి మాట్లాడుతానని ఆమె చెప్పారు. 1945 ఆగస్టు 18న తాయిపేలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారనే కథనం నిగ్గు తేల్చాలంటే రెంకోజీ ఆలయంలోని చితాభస్మానికి పరీక్షలు జరుపడం ఒక్కటే మార్గమనే వాదన చాలాకాలంగా ఉంది. 70 ఏళ్ళ  స్వతంత్ర భారతం : నేతాజీ ఏమి ఆశించేవారు? అనే అంశంపై ప్రసంగించేందుకు లండన్ వచ్చిన అనిత మీడియాతో మాట్లాడుతూ చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్ష జరిపి వివాదానికి తెరదించాలని అభిప్రాయపడ్డారు.

విమాన ప్రమాదంలో బోస్ మరణించారని నేను నమ్ముతాను . ఆయన జీవితానికి సంబంధించిన నికరమైన కథనం ఇదే అని ఆమె పేర్కొన్నారు. నేతాజీ గుమ్‌నామీ బాబాగా తిరిగారనేది ఓ పిచ్చికథ. బోస్‌కు అది అవమానకరం అని ఆమె అన్నారు.

చితాభస్మం తెప్పించి పరీక్షలు జరిపించే విషయం మాట్లాడడానికి బహుశా వచ్చే ఏడాది ప్రధాని మోదీని కలుస్తాను. ఆయన ఏమంటారో చూడాలి. రాజకీయవేత్తలు తమకు ప్రయోజనం లేకుంటే స్పందించరు అని అనిత అన్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ నేతాజీ అవశేషాలను వెనుకకు తెప్పించాలని ఆసక్తి చూపలేదని, ప్రతికూలతకు జడిసి ఆ విషయంలో తలదూర్చలేదని ఆమె అన్నారు.

భారత్, పాకిస్థాన్ తదితర దేశాల్లో పెద్దఎత్తున ఆడ శిశువులను చంపేయడం ఘోరమని అనితాబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి 74 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లండన్‌లో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. స్త్రీ విముక్తి వల్ల స్త్రీలకే కాకుండా మొత్తంగా సమాజానికి మేలు కలుగుతుందని అనిత అన్నారు. ఒక మగవాడిని చదివిస్తే అతడు బాగు పడతాడు. అదే ఒక స్త్రీని చదివిస్తే యావత్ కుటుంబం బాగుపడుతందని నేతాజీ చెప్పేవారని ఆమె గుర్తు చేశారు.






Comments